సుందరకాండలో ఆంజనేయస్వామికరణ గొప్ప వానరులు ఉన్నారా....
సుందరాకాండలో తనకంటే ఇంకా గొప్ప వానర వీరులు ఉన్నారు అని ఆంజనేయస్వామి అన్నారు కదా. అది వినయంగా అన్న మాటా? లేక నిజంగానే ఆయనను మించిన వానర వీరులు ఉన్నారా? ఉంటే వారు ఎవరు?
ఏవం గుణ గణైర్ యుక్తా
యస్య స్యుః కార్య సాధకాః,
తస్య సిద్ధ్యంతి సర్వేఽర్థా
దూత వాక్య ప్రచోదితాః "
- రామాయణం - 4:3;35
" ఎవరికైతే ఇలాంటి సకల సద్గుణాలు కలిగిన కార్యసాధకులు దూతలుగా ఉంటారో వారి పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి " అని.
మొదటిసారి హనుమ రామలక్ష్మణులను కలిసినప్పుడు హనుమ మాటలకు అబ్బురపడిన శ్రీరాముడు లక్ష్మణుడితో అన్న మాటలివి.
హనుమ వంటి చతురుడు దూతగా ఉంటే ఏ రాజు పనులయినా చక్కగా అయిపోతాయని.
అంటే అప్పుడే శ్రీరాముడు హనుమను సీతాన్వేషణకు దూతగా పంపాలని నిర్ణయించుకున్నారు అని అర్థం అవుతూంది.
అశోకవనంలో తనను కలిసిన హనుమతో సీతమ్మ అంటారు " సైన్యంతో నూరుయోజనాల సముద్రాన్ని దాటుకుని వచ్చి ఈ రాక్షసులని చంపి శ్రీరాముడు నన్ను తీసుకెడతారంటే నాకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదు " అని.
అంతగా బేలగా మాట్లాడిన నిస్సహాయ స్త్రీకి ధైర్యం చెప్పడం మాటలా ఎవరికయినా.
అది ఒక్క హనుమకే సాధ్యం.
మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ
సంతి తత్ర వనౌకసః
మత్తః ప్రత్యవరః
కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ
- (సుందరకాండ) 5:39:38
" నా కంటే గొప్పవారు, మరియు నాకు సమానమైన వారు వేలమంది వానరులు ఉన్నారు సుగ్రీవుని సైన్యంలో " అంటారు హనుమ. నాకన్నా తక్కువ శక్తిమంతులు ఎవరూ లేరక్కడ అని అర్ధం. మరి నేనే రాగలిగానంటే వారందరూ రావడానికి కష్టమేమిటమ్మా.
ఆ ఒకే ఒక్క మాటతో సీతమ్మకు కొండంత బలం చేకూరింది.
శ్రీరాముడిని జగదానందకారకుడు అంటారు. జగత్తు అంతకూ ఆనందం కలిగిస్తారని. ఆశ్చర్యకరంగా హనుమ సీతమ్మకు, సీతమ్మ జాడ తెలియచేసి రాముడికి ఆనందాన్ని కలిగించారు.
శ్రీరామ దూతం శిరసా నమామి.
శుభమస్తు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి